ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!
- గల్ఫ్ దేశాలు 90 శాతం మంచినీటికి ఈ ప్లాంట్లపైనే ఆధారపడతాయి
- ఒక్క క్షిపణి దాడితో కోట్లాది మందికి నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక
- హర్మూజ్ వివాదం 'నీటి యుద్ధం' వైపు మళ్లుతోందని ఆందోళన
పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాలు తమ తాగునీటి అవసరాల్లో దాదాపు 90 శాతం సముద్రపు నీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్లాంట్లపై చిన్న క్షిపణి దాడి జరిగినా కోట్లాది మంది ప్రజలు తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంటారు.
విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే నీటి శుద్ధి కేంద్రాల పునరుద్ధరణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే తమపై దాడి జరిగితే శత్రుదేశాల మనుగడనే దెబ్బతీసేలా ఈ ప్రణాళికను ఇరాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో అమెరికాకే కాకుండా, ఆ దేశ మిత్రపక్షాలైన అరబ్ దేశాలకు కూడా ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో హర్మూజ్ జలసంధి వివాదం ఇప్పుడు ‘నీటి యుద్ధం’ వైపు మళ్లుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ, ఇరు దేశాల నుంచి వస్తున్న ఇటువంటి కవ్వింపు చర్యలు, ప్రతిస్పందనలు గల్ఫ్‌లో యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.