అడగాలే కానీ.. గ్రీన్ లాండ్ కు ఇరాన్ సంచలన ఆఫర్
- ట్రంప్ నుంచి కాపాడతామంటూ ఇరాన్ ప్రకటన
- అమెరికాతో ఉద్రిక్తతల నడుమ వ్యూహాత్మక వ్యాఖ్యలు
- ఇరాన్ ఆఫర్‌ను అపహాస్యం చేస్తున్న పాశ్చాత్య దేశాలు
- సోషల్ మీడియాలో సెటైర్లతో స్పందిస్తున్న నెటిజన్లు
గ్రీన్ లాండ్ ను ఎలాగైనా దక్కించుకోవాలని, అమెరికా జాతీయ భద్రతకు అది అత్యంత కీలకమని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఆ దీవిని కొనుగోలు చేయడానికి సిద్ధమని అన్నారు. డెన్మార్క్ ప్రభుత్వం ఈ కొనుగోలు ప్రతిపాదనను తోసిపుచ్చినప్పటికీ, అవసరమైతే సైనిక చర్యల ద్వారా గ్రీన్ లాండ్ పై పట్టు సాధించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై ఐరోపా సమాఖ్య, నాటో దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇరాన్ వ్యూహాత్మకంగా ఈ ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు మద్దతు ఇవ్వడం ద్వారా అగ్రరాజ్యాన్ని ఇరుకున పెట్టాలని ఇరాన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. " గ్రీన్ లాండ్ కోరితే చాలు, వారికి మేము రక్షణగా నిలుస్తాం" అని ఇరాన్ అధికారులు పేర్కొనడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
అయితే, ఇరాన్ చేసిన ఈ ప్రతిపాదనను పాశ్చాత్య దేశాలు ఓ ‘‘అపహాస్యం’’గా కొట్టిపారేస్తున్నాయి. సొంత దేశంలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోలేకపోతున్న ఇరాన్, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రీన్ లాండ్ ను ఎలా కాపాడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.