ఇరాన్‌తో కాల్పుల విరమణ దిశగా ట్రంప్.. కొత్త మధ్యవర్తి కోసం వేట!
- ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూనే శాంతి చర్చలకు ట్రంప్ మొగ్గు
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలపై ప్రభావమే ఇందుకు కారణం
- ఒత్తిడి పెంచి ఇరాన్‌ను చర్చలకు రప్పించే వ్యూహంలో భాగం
యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుండటమే ట్రంప్ వైఖరిలో మార్పునకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరలతో అమెరికా స్టాక్ మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు శాంతి చర్చలే సరైన మార్గమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, ఒకవైపు ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేయడం, మరోవైపు శాంతి మంత్రం జపించడం ట్రంప్ అనుసరిస్తున్న ‘ఒత్తిడి-చర్చలు’ వ్యూహంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. కఠినమైన హెచ్చరికల ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి పెంచి, చర్చల టేబుల్‌పైకి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించినా, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ప్రభావవంతమైన వ్యక్తి లేదా దేశం అవసరమని అమెరికా యోచిస్తోంది.
ఇందులో భాగంగా ఇరాన్ చమురు రవాణాపై కొన్ని ఆంక్షలను సడలించేందుకు కూడా అమెరికా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. “మేము మా లక్ష్యాలకు చాలా దగ్గరగా ఉన్నాము” అని ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా యుద్ధానికి ముగింపు పలకాలనే ఆయన ఆలోచనకు బలం చేకూరుస్తున్నాయి.