కిమ్ మార్క్ ప్రజాస్వామ్యం.. నార్త్ కొరియా ఎన్నికల్లో కిమ్ కు 99.93% మంది ఓటేశారట!
- ఆ 0.07% వ్యతిరేక ఓట్లపై సర్వత్రా ఆసక్తికర చర్చ
- వ్యతిరేకంగా ఓటేసే స్వేచ్ఛ... కానీ ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే
- కిమ్‌కు ఎదురులేదని మరోసారి నిరూపితమైన వైనం
ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రక్రియ ఎంత సులువో, ఎంత పారదర్శకమో ఈ ఫలితాలే చెబుతున్నాయి. బ్యాలెట్ పేపర్‌పై కేవలం అధికార పార్టీ అభ్యర్థి పేరు మాత్రమే ఉంటుంది. ఓటర్లు వచ్చి, ఆ పేరుకు మద్దతుగా ఓటు వేసి తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడమే. ఒకవేళ ఎవరికైనా అభ్యర్థి నచ్చకపోతే, పేరును కొట్టివేసే 'విశాల హృదయం' కూడా ఎన్నికల సంఘం కల్పించింది.
అయితే, అలా చేసిన వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారు. వారి భవిష్యత్తు ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో, దేశ ప్రజలంతా తమ నాయకుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో దాదాపు 100% పోలింగ్‌లో పాల్గొన్నారు.
అయితే, ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం 0.07% వ్యతిరేక ఓట్లు. నియంత పాలనలో, ప్రాణాలకు తెగించి కిమ్‌ను వ్యతిరేకించిన ఆ ధైర్యశాలులు ఎవరనే దానిపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారి క్షేమ సమాచారాలపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఈ ఎన్నికలు కేవలం ఓ బూటకమని, ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నా.. తనకు ప్రజల నుంచి తిరుగులేని మద్దతు లభించిందని కిమ్ ఠీవిగా ప్రకటించుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో తన దేశంలోని 'ప్రత్యేకమైన ప్రజాస్వామ్యానికి' ఉన్న బలాన్ని ఆయన మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.