మమ్మల్ని ఆపేదెవరు?... ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం
- 2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ తప్పుకోనుందన్న వార్తలపై ఏఎఫ్సీ స్పందన
- ఇప్పటివరకు తమకు అధికారిక సమాచారం లేదని వెల్లడి
- అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ క్రీడా మంత్రి వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
- వరల్డ్ కప్ నుంచి తమను ఎవరూ తప్పించలేరన్న ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు
- వరల్డ్ కప్ నిర్వహించేది ఫిఫా తప్ప ఏ దేశమూ కాదన్న ఇరాన్
టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన తర్వాత ఈ ప్రచారం మొదలైంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో, తమ జట్టు ప్రపంచకప్ లో పాల్గొనడం కష్టమేనని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి వ్యాఖ్యానించడంతో గందరగోళం నెలకొంది.
ఈ పరిణామాలపై ఏఎఫ్సీ జనరల్ సెక్రటరీ విండ్సర్ జాన్ స్పందిస్తూ, "ఇది చాలా భావోద్వేగపూరిత సమయం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్యే. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, వారు వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నట్టు మాకు చెప్పారు. వారు మా సభ్యులు, వారు ఆడాలని మేము కోరుకుంటున్నాం. వారి సమస్యలు పరిష్కరించుకుని టోర్నీలో పాల్గొంటారని ఆశిస్తున్నాం" అని తెలిపారు.
మరోవైపు, జరుగుతున్న ప్రచారాన్ని ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తీవ్రంగా ఖండించింది. ఫిఫా నిర్వహించే టోర్నమెంట్లో పాల్గొనకుండా తమను అడ్డుకునే అధికారం ఏ దేశానికీ లేదని తేల్చిచెప్పింది. "వరల్డ్ కప్ అనేది ఒక చారిత్రాత్మక ఈవెంట్. దీనికి నిర్వాహక సంస్థ ఫిఫానే తప్ప ఏ దేశమూ కాదు. మమ్మల్ని ఎవరూ ప్రపంచ కప్ నుంచి తప్పించలేరు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఒకవేళ ఇరాన్ అధికారికంగా తప్పుకుంటే, ఆధునిక శకంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అవుతుంది.