నెతన్యాహుకు ఇరాన్ ‘డెత్ వార్నింగ్’!
- వెంటాడి, వేటాడి చంపుతామని ఐఆర్ జీసీ హెచ్చరిక
- బాగ్దాద్ అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి
- ఖర్గ్ ఐలాండ్‌ను ధ్వంసం చేసిన అమెరికా
యుద్ధం 16వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మరోసారి క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ఆవరణలోని హెలిప్యాడ్‌పై మిస్సైల్ పడటంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. మరోవైపు, ఇరాన్‌లోని వ్యూహాత్మక ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా జరిపిన బాంబు దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఖర్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ హర్మూజ్ జలసంధిలో నౌకల రక్షణకు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇరాన్ సైన్యం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ఐదు సార్లు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. తమ దేశ చమురు క్షేత్రాలపై దాడి జరిగితే పశ్చిమాసియాలో అమెరికా వాటాలున్న ప్రతి చమురు కేంద్రాన్ని బూడిద చేస్తామని హెచ్చరించారు. ఈ యుద్ధ ప్రభావంతో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా-1 రేసింగ్‌లు కూడా రద్దయ్యాయి. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.