రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక సూపర్‌ఫాస్ట్ వేగంతో టికెట్ బుకింగ్!
- 40 ఏళ్ల నాటి రిజర్వేషన్ వ్యవస్థ స్థానంలో కొత్త టెక్నాలజీ
- ఏప్రిల్-జూన్ మధ్య అందుబాటులోకి రానున్న సూపర్ ఫాస్ట్ టికెటింగ్
- నిమిషానికి లక్షకు పైగా టికెట్లు బుక్ చేసుకునే సామర్థ్యం
- సైబర్ దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు
- ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన బుకింగ్ అనుభవం
ప్రస్తుతం ఉన్న సిస్టమ్ తరచూ నెమ్మదిగా పనిచేయడం, తత్కాల్ బుకింగ్ సమయంలో క్రాష్ అవ్వడం వంటి సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో "పీఆర్ఎస్ ఆధునికీకరణ ఫేజ్ 2" పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఈ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ టెస్టింగ్ దశలో ఉందని, ఏప్రిల్-జూన్ మధ్యలో లైవ్‌లోకి వస్తుందని క్రిస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కొత్త సిస్టమ్ ద్వారా టికెట్ బుకింగ్ సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలుగుతుండగా, కొత్త వ్యవస్థతో నిమిషానికి లక్షకు పైగా టికెట్లు బుక్ చేయవచ్చు. అలాగే, టికెట్ ఎంక్వైరీల సామర్థ్యం కూడా నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు (పది రెట్లు) పెరగనుంది.
ఈ ఆధునికీకరణ కోసం సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా సైబర్ దాడులు, బాట్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు రూ.600 కోట్లతో ఇండియన్ రైల్వేస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (IR-SOC)ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్పులతో ప్రయాణికులకు టికెట్ బుకింగ్ అనుభవం మరింత వేగంగా, సులభంగా, సురక్షితంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.