సన్‌రైజర్స్‌కు షాక్.. 'ది హండ్రెడ్' నుంచి పాక్ స్పిన్నర్ అవుట్?
- అబ్రార్ అహ్మద్ ఎంపికపై తీవ్ర వ్యతిరేకత
- భారీ ధర వెచ్చించిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ
- రూ.2.34 కోట్లకు అబ్రార్‌ను కొనుగోలు చేసిన వైనం
- సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానులదే ఈ జట్టు
- పాక్ ఆటగాడి చేరికపై సోషల్ మీడియాలో నిరసనలు
లండన్‌లో ఆదివారం జరిగిన వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఏకంగా 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. అయితే, భారతీయ మూలాలున్న సన్‌రైజర్స్ యాజమాన్యం ఒక పాకిస్థాన్ ఆటగాడిని ఇంత భారీ ధరకు కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు జట్టులో కొనసాగుతాడా లేదా అన్న చర్చ మొదలైంది.
అబ్రార్ ఎంపికపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఒకవేళ నిరసనలు తీవ్రమైతే, టోర్నీ ప్రారంభానికి ముందే అతడిని తప్పించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గానీ, ఇటు సన్‌రైజర్స్ యాజమాన్యం గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.