'లైన్స్ ఆఫ్ లెగసీ' థీమ్‌తో కేకేఆర్ కొత్త జెర్సీ.. డిజైన్ ప్రత్యేకత ఇదే!
- ఐపీఎల్ 2026 కోసం కొత్త జెర్సీని విడుదల చేసిన కేకేఆర్
- 'లైన్స్ ఆఫ్ లెగసీ' థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్
- జట్టు చారిత్రక విజయాలను గుర్తుచేసేలా జెర్సీపై గీతలు
- ఈ నెల 29న ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ తొలి మ్యాచ్
2008లో బ్రెండన్ మెకల్లమ్ ఆడిన 158 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ నుంచి, రింకూ సింగ్ చివరి ఓవర్లో కొట్టిన ఐదు సిక్సర్ల వరకు.. ఇలాంటి ఎన్నో ఐకానిక్ క్షణాలను గీతల రూపంలో జెర్సీపై పొందుపరిచారు. ఈ గీతలన్నీ కలిసి కేకేఆర్ (KKR) అక్షరాలను ఆవిష్కరించేలా వినూత్నంగా డిజైన్ చేశారు. "ఈ జ్ఞాపకాలను జెర్సీలో భాగం చేయడం ద్వారా అభిమానులు జట్టు కథలో ఒక భాగాన్ని ధరించే అవకాశం కల్పిస్తున్నాం" అని కేకేఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ జెర్సీ ఆవిష్కరణపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. "ఈ జెర్సీ కేకేఆర్ సుదీర్ఘ ప్రయాణాన్ని, జట్టు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మా వారసత్వం పట్ల మేం గర్విస్తున్నాం" అని తెలిపారు.
బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి హోం మ్యాచ్‌లో తలపడుతుంది. ఇక, ఈసారి వేలంలో కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి కేకేఆర్ మరింత పటిష్ఠంగా మారింది.