రోహిత్, కోహ్లీ కోసం మరిన్ని వన్డేలు.. 2027 వన్డే వరల్డ్ కప్‌పై బీసీసీఐ ఫోకస్
- 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకున్న బీసీసీఐ
- విదేశీ పర్యటనల్లో అదనపు వన్డేలు ఆడేందుకు అంగీకారం
- గత ప్రపంచకప్ ఫైనల్ ఓటమి నేపథ్యంలో కీలక నిర్ణయం
- సీనియర్లు రోహిత్, కోహ్లీ సన్నద్ధతకు ఉపయోగపడనున్న మ్యాచ్‌లు
'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం విదేశీ పర్యటనల్లో అదనపు వన్డేలు ఆడించేందుకు పలు దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ ముందు ప్రతిపాదనలు ఉంచాయి. ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారికి ప్రపంచకప్ కోసం మెరుగ్గా సిద్ధమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. మరిన్ని మ్యాచ్‌లు ఆడటం వారి ఫామ్, ఫిట్‌నెస్‌కు దోహదపడుతుందని బోర్డు భావిస్తోంది.
ఐపీఎల్ ముగిశాక భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ పర్యటనలోనే ఐర్లాండ్‌తో కూడా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. మరోవైపు తమతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాలని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌తో కూడా సిరీస్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ తమ పర్యటనలో అదనపు వన్డేలు చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది.