రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు... సునీల్ నాయక్ విచారణ పొడిగింపు
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ముగిసిన సునీల్ నాయక్ ఐదో రోజు విచారణ
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించిన పోలీసులు
- సునీల్ నాయక్ విచారణను మరో మూడు రోజుల పాటు పొడిగించిన హైకోర్టు
- సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ సీన్ రీక్రియేషన్
- మార్చి 12కు ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారంతో ఈ విచారణ ముగుస్తుందని అంతా భావించారు. అయితే, సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా.. సునీల్ నాయక్ తరపు న్యాయవాదులకు వాదనలు వినిపించేందుకు న్యాయస్థానం మార్చి 12 వరకు అవకాశం కల్పించింది.
విచారణ అధికారి కోరిక మేరకు, మార్చి 12 వరకు విచారణకు హాజరుకావాలని హైకోర్టు సునీల్ నాయక్‌ను ఆదేశించింది. దీంతో మరో మూడు రోజుల పాటు ఆయనను విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు కాళ్లు వాచి, నడవలేని స్థితిలో కోర్టుకు హాజరైన ఘటన ఈ కేసుకు ప్రధాన కేంద్రం అన్న విషయం తెలిసిందే.