నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ
- ఈ రోజు ఉదయం 10.40 గంటల నుంచి 12 గంటల వరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో పవన్ సమావేశం
- హైదరాబాద్ నుంచి నేరుగా ఉండవల్లికి చేరుకోనున్న పవన్ కల్యాణ్
- పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం
ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు ఉదయం 10.40 గంటలకు వీరి సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఉదయమే నేరుగా ఉండవల్లికి చేరుకోనున్నారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించిన తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ నివేదికతో పాటు ఇతర అంశాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ తెలుస్తోంది.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గత నాలుగు రోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఈ అంశంపై టీడీపీ మాత్రమే ప్రత్యక్షంగా దూకుడుగా స్పందిస్తుండగా, ఇకపై కూటమి మొత్తం కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జనసేన కూడా ఈ అంశంలో మరింత యాక్టివ్‌గా పాల్గొనే దిశగా వ్యూహరచన జరిగే అవకాశముంది.
అదే సమయంలో త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటి పంపకం అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరగొచ్చని తెలుస్తోంది. కూటమి సమీకరణాల ప్రకారం టీడీపీకి రెండు స్థానాలు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూటమిలో సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరిగే అవకాశముందని సమాచారం. ఇదిలా ఉండగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అజెండాలో ఉండనున్నాయి. అలాగే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో, ఆ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో జగన్ పర్యటన చేపడుతున్నారని తెలుస్తోంది. ఈ పరిణామం దృష్ట్యా జగన్ పర్యటన వల్ల ఏర్పడే రాజకీయ ప్రభావం, కూటమి స్పందన ఎలా ఉండాలి? అనే అంశంపైనా చంద్రబాబు, పవన్ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. అవసరమైతే పవన్ కూడా జిల్లా పర్యటనలు చేపట్టాలా? లేక కూటమి ఉమ్మడిగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలా? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న కేబినెట్ సమావేశంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కొందరు మంత్రులు కీలక అంశాలపై చర్చించగా.. ఈరోజు జరగనున్న కీలక భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.