తనపై కేసు పెట్టిన తర్వాత విడదల రజని స్పందన
- చంద్రబాబుకు బుద్ధిని ఇవ్వాలని పూజ చేసేందుకు వెళితే తమపై కేసు పెట్టారన్న రజని
- ప్రత్తిపాటి పుల్లారావు తమపై దాడి చేయించారని ఆరోపణ
- చట్టాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్నారని మండిపాటు
అంబటి రాంబాబు ఇంటి మీదకు మళ్లీ వస్తాం... మళ్లీ కొడతామని ఎమ్మెల్యే మాధవి అంటున్నారని రజని మండిపడ్డారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏమిటో చూసుకోవాలని అన్నారు. అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వార్నింగ్ ఇస్తున్నారని... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడకు వెళుతోందని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పిందని తెలిపారు.
చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే... తనపై, తన అనుచరులపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దాడి చేయించారని రజని ఆరోపించారు. తమపై దాడి చేసి, తమపైనే కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ... చట్టాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నారని... మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ మహిళ అయిన తనపై అనేక సార్లు దాడులు చేశారని రజని మండిపడ్డారు. మాజీ మంత్రి అయిన తన పరిస్థితే ఇలా ఉంటే... సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని అన్నారు.