19 ఏళ్ల తర్వాత వైరల్ అవుతున్న ‘ఒంటరి పెంగ్విన్’ వీడియో!
- ట్రెండింగ్‌లో 2007 నాటి 'ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్' డాక్యుమెంటరీ క్లిప్
- ఆహారం, ఆశ్రయం కోసం వెళ్లకుండా.. ఒంటరిగా పర్వతాల వైపు వెళ్తున్న పెంగ్విన్
- ఆధునిక కాలంలోని ఒంటరితనం, శూన్యవాదానికి ఈ పెంగ్విన్ ప్రతీక అంటున్న నెటిజన్లు
- ఈ వీడియో ఆధారంగా వేల సంఖ్యలో మీమ్స్, ఫిలాసఫికల్ చర్చలు
సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి, మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారి తీస్తుంది. ఈ దృశ్యం చూస్తుంటే ఆ పెంగ్విన్‌కు జీవితంపై విరక్తి కలిగిందా? లేక దానికి పిచ్చి పట్టిందా? అనే అనుమానం కలుగుతుంది.
ప్రస్తుత కాలంలో మనుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ‘ఏమీ లేని శూన్యం’ అనే భావనలకు ఈ పెంగ్విన్ ఒక గుర్తుగా మారింది. "మేమంతా ఆ పెంగ్విన్ లాంటి వాళ్లమే.. ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, టెక్‌టాక్ లలో ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
ఈ వైరల్ వీడియో పుణ్యమా అని 19 ఏళ్ల క్రితం వచ్చిన ఆ డాక్యుమెంటరీని ఇప్పుడు మళ్లీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో జనం ఎగబడి చూస్తున్నారు. సైకాలజిస్టులు సైతం ఈ వీడియోపై స్పందిస్తూ.. ప్రకృతిలో కూడా ఇలాంటి అసాధారణ ప్రవర్తనలు ఉంటాయని, అది మనుషులకు ఒక అద్దం పట్టినట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు.