విశాఖ రైల్వేస్టేషన్ లో 'రోబో పోలీస్ అధికారి'... దేశంలోనే తొలిసారి... వీడియో ఇదిగో!
- విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 'ఏఎస్సీ అర్జున్' రోబో సేవలు ప్రారంభం
- భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి
- ప్రయాణికుల భద్రత, సహాయం కోసం రోబోను ప్రవేశపెట్టిన ఆర్పీఎఫ్
- ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలోనే దేశీయంగా అభివృద్ధి చేశారు
ప్రయాణికుల భద్రత, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ రోబోను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 'ఏఎస్సీ అర్జున్' రోబో.. ప్రయాణికులకు సహాయం చేయడం, రద్దీని నియంత్రించడం, పరిశుభ్రతను పర్యవేక్షించడం, భద్రతాపరమైన అవగాహన కల్పించడం వంటి పనులను నిర్వర్తిస్తుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ రోబోను ప్రవేశపెట్టారు.
ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలోనే దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేయడం విశేషం. ఏడాదికి పైగా సమయం వెచ్చించి ఈ టెక్నాలజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సేవల్లో టెక్నాలజీని అనుసంధానించడంలో ఈ రోబో సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే భావిస్తోంది.