లండన్ ప్రైమరీ స్కూల్ లో భారత విద్యార్థిపై వివక్ష.. తిలకం పెట్టుకోవడమే కారణం
- యాజమాన్యం తీరుపై మండిపడుతున్న హిందువులు
- వివక్ష కారణంగా స్కూలు మారిన బాలుడు
- ఇలాంటి కారణాలతోనే ఈ స్కూలు వీడిన నలుగురు విద్యార్థులు
లండన్ లోని హిందూ కుటుంబానికి చెందిన బాలుడు ఇటీవల నుదుట తిలకం పెట్టుకుని స్కూలుకు వెళ్లాడు. తిలకంతో వచ్చిన ఆ బాలుడిని తోటి విద్యార్థులు వింతగా చూశారు. టీచర్లు సైతం ఆశ్చర్యంగా బాలుడి మతవిశ్వాసాల గురించి ఆరాతీశారు. పిల్లలంతా ఆడుకునే సమయంలో హెడ్ టీచర్ ఈ బాలుడిపై ప్రత్యేకంగా దృష్టి సారించేవారు. ఈ పరిణామాలతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. ఈ వివక్ష వల్ల తమ బాబును స్కూలు మార్చాల్సి వచ్చిందని తల్లిదండ్రులు వాపోయారు.
తమ మత విశ్వాసాల గురించి పాఠశాల యాజమాన్యానికి వివరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని బాలుడి తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికంగా హిందువులు తీవ్రంగా ఆక్షేపించారు. గతంలోనూ ఇదే స్కూలు నుంచి దాదాపు ఇవే ఆరోపణలతో నలుగురు విద్యార్థులు వేరే స్కూలులో చేరారని సమాచారం.