ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం
- స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ వెల్లడి
- అగ్రస్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా
- యూకే, జపాన్, జర్మనీ వంటి దేశాలను అధిగమించిన ఇండియా
- టాలెంట్ విభాగంలో భారత్‌కు టాప్-3లో చోటు
ఈ జాబితాలో 78.6 స్కోర్‌తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 36.95 స్కోర్‌తో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించడం విశేషం.
పరిశోధన, అభివృద్ధి (R&D), టాలెంట్ లభ్యత, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు వంటి అనేక కీలక అంశాలను విశ్లేషించి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ర్యాంకులను కేటాయించింది. ముఖ్యంగా 'టాలెంట్' విభాగంలో భారత్ ప్రపంచంలోని టాప్-3 దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలోని ఇంజనీర్లు, డెవలపర్‌ల భారీ సంఖ్య ఇందుకు దోహదపడింది.
తక్కువ-మధ్య ఆదాయ దేశాల కేటగిరీలో ఈ జాబితాలో ఇంత ఉన్నత స్థానంలో నిలిచిన ఏకైక దేశం భారత్ కావడం గమనార్హం. ఏఐ రంగంలో భారత్‌లో పెరుగుతున్న పెట్టుబడులు, బలమైన స్టార్టప్ వ్యవస్థ, విస్తరిస్తున్న పరిశోధనలకు ఈ ర్యాంకింగ్ అద్దం పడుతోంది. అయితే, ఏఐ అభివృద్ధిలో దేశాల మధ్య అంతరం పెరిగితే ప్రపంచ అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.