వేవ్స్ లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు... అది కూడా పుష్ప, బాహుబలి చిత్రాలపై!
- ముంబై 'వేవ్స్' సదస్సులో పాల్గొన్న నటుడు నాగార్జున.
- పాన్ ఇండియా చిత్రాల విజయంపై ఆసక్తికర విశ్లేషణ
- లార్జర్ దేన్ లైఫ్ పాత్రలకే ప్రేక్షకుల ప్రాధాన్యత అని వెల్లడి
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "‘పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇతర భాషల్లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టాయి" అని గుర్తుచేశారు. నేటి తరం ప్రేక్షకులు హీరోలను 'పుష్పరాజ్', 'రాకీ' (కేజీఎఫ్), 'బాహుబలి' వంటి అసాధారణమైన, శక్తివంతమైన పాత్రల్లో చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, తాను కూడా అలాంటి పాత్రలనే ఇష్టపడతానని అన్నారు. కేవలం హీరోల ఎలివేషన్ మాత్రమే కాకుండా, బలమైన కథనం, కథ ఉండటం వల్లే ఈ చిత్రాలు భారీ విజయాలు సాధించాయని ఆయన స్పష్టం చేశారు.
"రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాన్ని తెలుగులో నిర్మించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దాన్ని ఆదరించారు" అని నాగార్జున పేర్కొన్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, తెరపై జరిగే మ్యాజిక్‌ను ఆస్వాదించడానికి చాలామంది సినిమాలను ఆశ్రయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వేడుకకు అమీర్ ఖాన్, కరీనా కపూర్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. గురువారం మొదలైన ఈ సదస్సు ఆదివారం వరకు కొనసాగనుంది.