Canada shooting: కెనడాలో గ్యాంగ్ వార్.. బుల్లెట్ తగిలి భారత విద్యార్థిని మృతి

Indian Student Killed in Canada Gang Shooting

  • హామిల్టన్ లో పరస్పరం కాల్పులు జరుపుకున్న వాహనదారులు
  • బుల్లెట్ మిస్ ఫైర్.. బస్టాప్ లో వెయిట్ చేస్తున్న యువతికి గాయాలు
  • ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయిన యువతి
  • కుటుంబానికి అండగా ఉంటామని భారత కాన్సులేట్ వెల్లడి

ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థిని ఒకరు అక్కడ జరిగిన కాల్పుల్లో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్ నగరంలో బుధవారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధావా (21) అనే విద్యార్థిని, పనికి వెళ్లేందుకు స్థానిక బస్టాప్‌లో వేచి ఉన్నారు. అదే సమయంలో రెండు కార్లలోని వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ హర్‌సిమ్రత్ ఛాతీకి తగిలింది.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు హామిల్టన్ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తీవ్ర గాయాలతో పడి ఉన్న హర్‌సిమ్రత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ కాల్పుల ఘటనతో హర్‌సిమ్రత్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆమె అమాయకురాలని పోలీసులు స్పష్టం చేశారు. రెండు వాహనాల మధ్య జరిగిన గొడవలో ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి లభించిన వీడియో ఆధారంగా, నల్ల కారులోని ప్రయాణికుడు తెల్ల కారుపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఘటన అనంతరం రెండు వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

హర్‌సిమ్రత్ రంధావా మృతి పట్ల టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. హర్‌సిమ్రత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు హామిల్టన్ పోలీసులు వెల్లడించారు. ఘటనపై సమాచారం తెలిసిన వారు లేదా డ్యాష్ కెమెరా ఫుటేజీ ఉన్నవారు తమను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Canada shooting
Indian student death
Hamilton Ontario
Harsimrat Randhawa
Gang violence
Mohawk College
Canada
India
International student
  • Loading...

More Telugu News