తాజా టారిఫ్ లతో అమెరికాకు ఎంత ఆదాయం వస్తోందంటే.. కీలక వివరాలు వెల్లడించిన ట్రంప్
- టారిఫ్ లపై చర్చలు జరిపేందుకు సిద్ధమని మరోమారు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
- జపాన్, సౌత్ కొరియాల ప్రతినిధులు చర్చలకు వస్తున్నారని వివరణ
- చైనాపై 104 శాతం టారిఫ్ లు అమలులోకి వచ్చినట్లు వెల్లడి
రోజుకు 2 బిలియన్ డాలర్లు అమెరికా ఖజానాలో జమవుతున్నాయని తెలిపారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని వస్తువులపై వసూలు చేస్తున్న కనీస టారిఫ్ సొమ్ము కూడా ఇందులో ఉందన్నారు. కాగా, టారిఫ్ ల విషయంలో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ మరోమారు ప్రకటించారు. ఈ విషయంలో జపాన్, సౌత్ కొరియా దేశాలు ముందుకు వచ్చాయని చెప్పారు. ట్రంప్ జపాన్ పై 24 శాతం, సౌత్ కొరియాపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించారు.
దీనిపై చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వస్తున్నారని ట్రంప్ వివరించారు. మరోవైపు, తాను విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కౌంటర్ గా 34 శాతం పన్నులు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. చైనాపై అదనంగా 50 శాతం పన్ను విధించారు. చైనాపై గతంలో 20 శాతం పన్ను వసూలు చేస్తుండగా.. ట్రంప్ 34 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. తాజాగా 50 శాతం అదనపు సుంకాలతో చైనాపై అమెరికా విధించిన పన్ను మొత్తం 104 శాతానికి చేరింది. ఈ పన్నులు బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.