రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- రేవంత్ కు విద్యారంగంపై అవగాహన లేదన్న ప్రవీణ్ కుమార్
- ప్రతిభ పాఠశాలలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపాటు
- నేషనల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన నందినికి రూ. కోటి నజరానా ప్రకటించాలని డిమాండ్
కేసీఆర్ హయాంలో 30కి పైగా ప్రతిభ పాఠశాలలను నెలకొల్పారని... ఆ పాఠశాలల నుంచి ఎంతో మంది ఇంజినీర్లు, డాక్టర్లు వచ్చారని... రేవంత్ హయాంలో ఆ పాఠశాలలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ఎస్సీ విద్యార్థుల ఫీజులను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని విమర్శించారు.
గురుకులంలో చదివిన రజక కులానికి చెందిన నందిని బ్యాడ్మింటన్ లో నేషనల్ గేమ్స్ లో బంగారు పతకాన్ని సాధిస్తే... రేవంత్ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి ప్రోత్సాహకం ప్రకటించలేదని దుయ్యబట్టారు. బీసీ విద్యార్థిని అయినందుకే ఆమెను పట్టించుకోలేదా? అని ప్రశ్నించారు. తక్షణమే నందినికి కోటి రూపాయల నజరానా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే... వీరితో పాటు టీన్యూస్ రిపోర్టర్ పై కూడా కేసులు పెట్టారని విమర్శించారు. ఆ ఇద్దరు విద్యార్థినులను కూడా పీఎస్ లో 2 గంటల సేపు విచారించారని చెప్పారు. చదువుకోవాల్సిన విద్యార్థినులను పీఎస్ లో పెడతారా? అని మండిపడ్డారు.