వేలంలో పృథ్వీషా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడంపై ఢిల్లీ కేపిటల్స్ సంచలన వ్యాఖ్యలు
- ఆరేళ్లపాటు ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడిన పృథ్వీషా
- నిలకడలేమి కారణంగా వదిలించుకున్న జట్టు
- రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి
- కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిన క్రికెటర్
- అప్పుడప్పుడు ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతుండాలన్న పార్థ్ జిందాల్
- పొగడ్తలతో అతడి ఎదుగుదలను అడ్డుకున్నారని విమర్శలు
2018 నుంచి ఆరేళ్లపాటు ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడిన షాను నిలకడ లేమి కారణంగా జట్టు వదిలించుకుంది. ఈ నేపథ్యంలో వేలానికి వెళ్లినా అతడికి నిరాశే ఎదురైంది. షా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడంపై ఢిల్లీ కేపిట్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ తాజాగా మాట్లాడుతూ.. షా ప్రయాణంలో ఒడిదొడుకుల గురించి చాలా విషయాలు మాట్లాడారు. పృథ్వీ గొప్ప ఆటగాడని, అయితే తనను తాను తప్పుగా అర్థం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి ఎదురుదెబ్బలు అప్పుడప్పుడు తగులుతూ ఉండాలని పేర్కొన్నారు. పతనం నుంచి అతడు బయట పడాలని ఆకాంక్షించారు.
షా కెరియర్ మొదట్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి వారితో పోల్చి అతడి ఎదుగుదలకు ఆటంకం కలిగించే వాతావరణాన్ని సృష్టించారని జిందాల్ విమర్శించారు. ముంబై క్రికెట్‌లో ప్రతి ఒక్కరు అతడి గురించి మాట్లాడేవారని గుర్తు చేశారు. ముంబై ఒక సునీల్ గవాస్కర్, ఒక సచిన్ టెండూల్కర్‌ను ఇచ్చిందని, అలాగే పృథ్వీషా గురించి కూడా మాట్లాడుకున్నారని చెప్పారు. కాబట్టి అతడికి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలాలని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.