తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం ...హైబ్రిడ్ వాహనాలకు పన్ను రాయితీ!
- హైబ్రిడ్ వాహనాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నామన్న మంత్రి పొన్నం
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన మంత్రి పొన్నం
- కాలం చెల్లిన వాహనాలను ప్రజలు స్వచ్చందంగా స్క్రాప్ చేయాలని సూచన
బ్యాటరీ, పెట్రోల్ లేదా బ్యాటరీ, డీజిల్ కాంబినేటేషన్ లో హైబ్రిడ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై వంద శాతం రాయితీ ఇవ్వాలని రవాణా శాఖ యోచిస్తోందని తెలిపారు. వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో పాఠశాలలన్నీ బంద్ చేసే పరిస్థితికి వచ్చిందన్నారు. హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణలో ఢిల్లీ వంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.
రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలంటే కాలం చెల్లిన (15 ఏళ్లు దాటిన) వాహనాలను ప్రజలు స్వచ్చందంగా స్క్రాప్ చేయాలని సూచించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)నే కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.