Backward Walking: వెనక్కి నడిస్తే నవ్వుతారు అనుకోవద్దు... ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
- నడక ఆరోగ్యదాయకం
- వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు
- వెనక్కి నడవడం వల్ల రెట్టింపు లాభాలున్నాయంటున్న నిపుణులు
నడక సర్వ విధాలా ఆరోగ్యదాయకం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముందుకే కాదు, వెనక్కి నడిచినా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎవరైనా ముందుకు నడుస్తారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
మనం నిత్యం పార్కుల్లో వాకింగ్ చేసే వాళ్లను చూస్తుంటాం. అయితే ఎవరైనా వెనక్కి నడుస్తుంటే నవ్వొస్తుంది. వెనక్కి నడిస్తే నవ్వుతారని అనుకోవద్దని, వెనక్కి నడవడం ఎంత లాభదాయకమో తెలిస్తే వెనక్కి నడవకుండా ఉండలేరని నిపుణులు అంటున్నారు.
వెనక్కి నడవడం వల్లే కలిగే ప్రయోజనాలు...
- ముందుకు నడిస్తే ఖర్చయ్యే శక్తి కంటే వెనక్కి నడిస్తే 40 శాతం శక్తి ఎక్కువగా ఖర్చవుతుంది. దాంతో శరీరంలో కొవ్వు కరిగేందుకు వెనక్కి నడవడం ఎంతో ఉపయోగపడుతుంది.
- వెనక్కి నడవడం వల్ల రొటీన్ కు భిన్నంగా ఫీలవుతారు. దాంతో విసుగు పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది.
- కాళ్ల కండరాలను దృఢంగా ఉంచుకునేందుకు వెనక్కి నడవడం తోడ్పడుతుంది. కాలి పిక్కలు, మడమల వద్ద కండరాలు పటుత్వం పెరగాలంటే వెనక్కి నడవడం మంచి వ్యాయామం. అయితే, వేగంగా వెనక్కి నడిచినప్పుడే కాలి కండరాలు బలంగా తయారవుతాయట.
- అంతేకాదు, వెనక్కి నడవడం వల్ల శరీర సమతుల్యత స్థిరంగా ఉంటుంది. వివిధ శరీర భాగాల మధ్య సమన్వయం కూడా చక్కగా కుదురుతుంది.
- ఈ తరహా నడక వల్ల శరీర జీవక్రియలు కూడా మెరుగవుతాయి. కెలోరీలు బాగా ఖర్చవుతాయి.
- బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడం వల్లనే త్వరితగతిన ప్రయోజనం కనిపిస్తుంది.
- వెనక్కి నడిచేందుకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని, మొదట తక్కువ వేగంతో వెనక్కి నడవాలి... ఆ తర్వాత క్రమంగా వేగం పెంచాలి.
- కాళ్లకు తగిన బూట్లు ధరిస్తే వెనక్కి నడిచేటప్పుడు పడిపోకుండా ఉంటారు.