కొచ్చిలో లాక్ డౌన్ పరిస్థితులు.. ఎందుకంటే!
- కొచ్చిలోని బ్రహ్మపురం డంప్ యార్డ్ లో అగ్ని ప్రమాదం
- చెత్త, ప్లాస్టిక్ కాలిపోయి విషపూరిత పొగలతో జనం ఉక్కిరిబిక్కిరి
- వారం రోజులుగా తలుపులు, కిటికీలు మూసి ఇళ్లకే పరిమితం అయిన జనాలు
చాలా మంది తలుపులు, కిటికీలు మూసి ఇంట్లోనే ఉంటున్నారు. మరికొందరైతే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని యోచిస్తున్నారు. గుట్టలాంటి చెత్త కుప్ప కారణంగా బ్రహ్మపురం నివాసితులు ఇలాంటి ఘటనలను ప్రతీ సంవత్సరం చూస్తుంటారు. కానీ, ఈ సారి తీవ్రత ఎక్కువ కావడంతో జనం అల్లాడిపోతున్నారు. చెత్త వాసన పీల్చడమే కష్టం అవుతుండగా ఇప్పుడు అది కాలిపోయి ఘాటైన రసాయనాల వాసన పీల్చడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ‘మొదట్లో బాగానే ఉంది కానీ ఆదివారం నుంచి వాసన మరీ ఎక్కువైంది. బాల్కనీ, కిటికీలు తెరవలేక పోయాం. కరోనా వాపస్ వచ్చినట్టు అనిపిస్తోంది. రాత్రి అయితే వాసన మరీ ఎక్కువగా వస్తోంది’ అని అక్కడి మహిళ తమ ఇబ్బందిని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు బ్రహ్మపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.