Health: నల్ల ఎండు ద్రాక్ష.. అస్సలు మిస్ కావద్దు..!
- వీటిల్లో ఎన్నో పోషకాలు
- ఆరోగ్యానికి కీలకమైన ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు
- రక్త హీనత సమస్యకు చక్కని పరిష్కారం
ఎండు ద్రాక్ష(రైజిన్స్)లో పలు రకాలున్నాయి. వీటిల్లో నల్ల ఎండు ద్రాక్ష ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. రుచి విషయంలోనూ ఇవి నంబర్ 1గా ఉంటాయి. మార్కెట్లో నల్ల ద్రాక్ష పండ్లు చూసే ఉంటారు. ఈ నల్లద్రాక్ష డ్రై చేసిన తర్వాత తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
ప్రొటీన్లు
నల్ల ఎండు ద్రాక్ష (కిస్ మిస్)లో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కండరాలు, ఎముకలు, కార్టిలేజ్ (మృదులాస్థి) ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ తగినంత అవసరం. అలాగే, పీహెచ్ స్థాయి ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తుంది. వ్యాధి నిరోధక శక్తికి కీలకంగా పనిచేస్తుంది. శరీరంలో నీటి సమతుల్యతకు కూడా ప్రొటీన్ అవసరం.
కళ్లకు మేలు
వీటిల్లోని విటమిన్ సీ, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ కెమికల్స్ అయిన ఫైనో న్యూట్రియంట్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అన్నవి కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే మాక్యులర్ డీజెనరేషన్, గ్లకోమా, క్యాటరాక్ట్ సమస్యల రిస్క్ ను తగ్గిస్తుంది. రాత్రంతా నీళ్లలో కొన్ని నల్ల ఎండు ద్రాక్షను నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తహీనతకు చెక్
నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ తగినంత ఉంటుంది. ఇతర ఏ పండ్లతో చూసినా ఐరన్ ఇందులోనే ఎక్కువగా లభిస్తుంది. ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. కణాలకు ఆక్సిజన్ ను మోసుకెళ్లేవే ఎర్ర రక్తకణాలు. అందుకని రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్న వారు వీటిని తప్పకుండా తీసుకోవడం మంచి ఫలితమిస్తుంది.
జట్టు రాలడం
నేటి కాలంలో ఈ సమస్యను ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. ఎండు ద్రాక్షను రోజూ తీసుకుని చూస్తే కచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఎండుద్రాక్ష సాయపడుతుంది. ఇందులోని పోషకాలు శిరోజాలు ఆరోగ్యంగా పెరిగేందుకు సాయపడుతాయి.