రేణుకా చౌదరి నోట పుష్ప డైలాగ్!
- గెలిచినా, ఓడినా ఖమ్మం ఆడబిడ్డగానే ఉంటా
- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు
- పార్టీ కార్యకర్తలు ఉక్రెయిన్ సైనికుల్లా పోరాడాలని రేణుక పిలుపు
గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న రేణుకా చౌదరి.. తాను ఎక్కడికీ పోలేదని గురువారం వ్యాఖ్యానించారు. నివురు గప్పిన నిప్పులా కాచుకుని కూర్చున్నానంటూ ఆమె అన్నారు. గ్రూపు రాజకీయాలు వద్దన్న భావనతోనే సైలెంట్‌గా ఉన్నానని చెప్పిన ఆమె.. తనకంటే బెటర్‌గా పనిచేస్తారేమోనని వెయిట్ చేశానని చెప్పారు. గెలుపు కోసం జిల్లాలు మార్చే నేతలు ఉన్నారన్న రేణుక.. గెలిచినా, ఓడినా తాను ఖమ్మం ఆడబిడ్డగానే ఉంటానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తల మనోభీష్టానికి అనుగుణంగానే నడుచుకుంటానన్నారు.
తనకు రాజకీయ వారసులు లేరని చెప్పిన రేణుక.. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని, అది ఎక్కడికి పోదని చెప్పారు. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ జిల్లాగా పేర్కొన్న ఆమె.. తిరుగుబాటు వచ్చేది ఖమ్మం నుంచేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఆమె మంత్రి పువ్వాడ అజయ్‌కి తాను భయపడబోనని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పిన రేణుక.. నరేంద్ర మోదీవి కేవలం మాటలు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీ కార్యకర్తలు ఉక్రెయిన్ సైనికుల్లా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.