ముగ్గురు నటీమణులు కలసి నటిస్తున్న సినిమా!
- శర్వానంద్ హీరోగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
- కిషోర్ తిరుమల దర్శకత్వం.. నాయికగా రష్మిక
- మూడు కీలక పాత్రలలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి
- ప్రత్యేక పోస్టర్లు విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' పేరిట తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇందులో మూడు కీలక పాత్రలు వున్నాయి. మూడు పాత్రలూ కూడా డిఫరెంట్ గా సాగుతాయట. ఈ పాత్రలకు సీనియర్ నటీమణులు అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో తాజాగా రాధిక, ఖుష్బూ, ఊర్వశిలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ముగ్గురూ ఇందులో నటిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటిస్తూ, స్పెషల్ పోస్టర్లు విడుదల చేసింది. తమ బృందంలోకి వీరికి స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.