అలాంటివి చేయలేకే సినిమాలను వదులుకున్నా: శ్రీముఖి
- సినిమాలు చేయడం నాన్నకు ఇష్టంలేదు
- రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించా
- ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడిగారు
'జులాయి' చిత్రం చేస్తున్నప్పుడే సినిమాలు వద్దని తన తండ్రి చెప్పారని శ్రీముఖి తెలిపింది. ఈ సినిమానే చివరి చిత్రం కావాలని ఆదేశించారని చెప్పింది. అయితే ఆ తర్వాత రెండు, మూడు ఆఫర్లు రావడంతో ఆ సినిమాల్లో కూడా నటించానని... ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, టీవీ షోలతో బిజీ అయ్యానని తెలిపింది.
టీవీ షోలు చేస్తుంటే, సినిమా అవకాశాలు రావని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చెప్పారని... ఆయన చెప్పినట్టుగానే జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించానని తెలిపింది. వాటిలో తన పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం ఒక కారణమైతే... ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడగడం మరో కారణమని చెప్పింది. అలాంటివి చేయడం మన వల్ల కాదనే సినిమాలు వదులుకున్నానని తెలిపింది. ఆ తర్వాత టీవీ షోలతో బిజీ అయిపోయానని చెప్పింది.