లోకేశ్ కోసమే సుహాసినిని బలి చేస్తున్నారు.. నిజంగా అంత ప్రేముంటే ఏపీలో మంత్రిని చేయొచ్చుగా!: కేటీఆర్
- ఆమెను రాజకీయంగా సమాధి చేయబోతున్నారు
- జగన్ దాడి ఘటనపై మనిషిగా స్పందించా
- కూకట్ పల్లి సభలో మంత్రి కేటీఆర్
ప్రాంతం, జాతి, కులం, మతం ఆధారంగా తమ ప్రభుత్వం వివక్ష చూపలేదనీ, అందరిని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో విద్యుత్ కోత అన్నది లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చాలా తెలివైనవారనీ, అందుకే నందమూరి సుహాసినిని కూకట్ పల్లిలో పోటీకి దింపారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేశ్ కు ఎవ్వరూ అడ్డు రాకూడదన్న కుట్రతోనే సుహాసినిని ఓడిపోయే కూకట్ పల్లి స్థానంలో పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు. ఆమె రాజకీయ జీవితాన్ని సమాధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నందమూరి కుటుంబంపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే ఏపీలో లోకేశ్ కు ఇచ్చినట్లే సుహాసినికి సైతం మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.