తమ నాయకుడిని కాపాడుకోవాలన్న కులగజ్జితోనే రేవంత్ పై సానుభూతి స్టోరీలు!: వైసీపీ నేత భూమన
- రేవంత్ పై ఐటీ దాడుల్లో బయటపడ్డ సొమ్ము ఎవరిది
- ఎవరిని కాపాడేందుకు సానుభూతి స్టోరీలు వేశారు
- చంద్రబాబుకు న్యాయ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేదు
కేవలం తమ నాయకుడిని కాపాడుకోవాలన్న కులగజ్జి కారణంగానే ఎల్లో మీడియా అనుకూల కథనాలను ప్రసారం చేసిందని భూమన అన్నారు. ఏపీ, తెలంగాణలో చట్టం, న్యాయం, రాజ్యాంగం అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులు చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
అసలు సూత్రధారిని మూడేళ్ల పాటు వదిలేసి పాత్రధారిపై దాడులెందుకు జరుగుతున్నాయని అడిగారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరుపై రూ.1,200 కోట్లు, మంత్రి లోకేశ్ పేరుపై రూ.500 కోట్లు ఉన్నాయనీ, చివరికి చంద్రబాబుతో పాటు చిన్నపిల్లాడు దేవాన్ష్ కూడా సంపాదిస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధైర్యంతోనే చంద్రబాబు ధర్మాబాద్ కోర్టు సమన్లకు గతంలో స్పందించలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి న్యాయవ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.