టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.. ప్రకటించిన కేటీఆర్!
- పార్టీలో ఆయన స్థాయికి తగ్గ గౌరవమిస్తాం
- కేసీఆర్ తో ఆయనది 29 ఏళ్ల అనుబంధం
- మీడియా సమావేశంలో కేటీఆర్
ఈ రోజు సురేశ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేశ్ రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. సురేశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా పనిచేశారనీ, టీఆర్ఎస్ లో ఆయన స్థాయికి తగ్గ గౌరవం ఇస్తామని కేటీఆర్ తెలిపారు. సురేశ్ రెడ్డితో పాటు వందలాది మంది ఆయన అనుచరులు టీఆర్ఎస్ లో చేరుతారని ప్రకటించారు. తమ ఆహ్వానాన్ని మన్నించినందుకు కేటీఆర్ సురేశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో సురేశ్ రెడ్డికి ఈ సారి అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బాల్కొండలో కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసిన సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తాజాగా బాల్కొండ పార్టీ టికెట్ ను ప్రశాంత్ రెడ్డికి టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన నేపథ్యంలో సురేశ్ రెడ్డికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.