దిగొచ్చిన దలైలామా.. నెహ్రూపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ
- నెహ్రూ ప్రధాని కావడం వల్లే భారత్-పాక్ విడిపోయాయన్న దలైలామా
- జిన్నాను ప్రధానిని చేయాలని గాంధీ భావించారన్న ఆధ్యాత్మిక గురువు
- వివాదాస్పదం కావడంతో క్షమాపణలు
దలైలామా ఇటీవల గోవా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. మహమ్మద్ జిన్నాను మహాత్మాగాంధీ ప్రధానిని చేయాలని అనుకున్నారని అన్నారు. అదే జరిగి ఉంటే భారత్-పాక్‌లు రెండుగా విడిపోయి ఉండేవి కావన్నారు. జిన్నాను ప్రధాని చేసేందుకు నెహ్రూ అంగీకరించలేదని పేర్కొన్నారు. నెహ్రూ ప్రధాని కావడం వల్లే భారత్-పాక్‌లు విడిపోయాయన్నారు. ఎంతో అనుభవం ఉన్న, తెలివైన వ్యక్తే తప్పులు చేశారని, కాబట్టి సందర్భానుసారంగా సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దలైలామా వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమయ్యాయి. భారత్-పాక్ విడిపోవడానికి నెహ్రూ కారణమా? అంటూ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోశారు. దీంతో దిగివచ్చిన దలైలామా తాజాగా క్షమాపణలు చెప్పారు.