జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు

Jagapathi Babu says it is not right to trouble Janhvi Kapoor
  • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ట్రోల్స్
  • దర్శకుడు చెప్పిందే జాన్వీ చేసిందన్న జగపతిబాబు
  • తాను జాన్వీకే సపోర్ట్ చేస్తానని వ్యాఖ్య

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే రూ.236 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో 'అప్పలసూరి' పాత్రలో మెప్పించిన సీనియర్ నటుడు జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర, ఆమెపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందిస్తూ ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు.


సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన క్యారెక్టర్‌పై వస్తున్న విమర్శలపై జగపతిబాబు తీవ్రంగా స్పందించారు. "సినిమా విషయంలో ఆర్టిస్టులను అనవసరంగా ట్రోల్‌ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి (జాన్వీ కపూర్) దర్శకుడు తనకు ఏం చెప్పాడో, ఎలా చేయమన్నాడో అలాగే చేసింది. కొన్నిసార్లు క్యారెక్టరైజేషన్ అనుకున్నట్లు రాక మిస్ ఫైర్ అవ్వచ్చు. అంత మాత్రాన ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ట్రోల్స్ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో నేను కచ్చితంగా జాన్వీకపూర్‌కే సపోర్ట్ చేస్తాను" అన్నారు.


తన పాత్ర గురించి మాట్లాడుతూ... "మధ్యలో నేను ఎన్ని సినిమాలు చేసినా, ‘పెద్ది’ విడుదల కోసమే ఎంతగానో ఎదురుచూశాను. ఈ సినిమా కోసం నేను ప్రాణం పెట్టి పనిచేశాను. రూ.300 కోట్లు పెట్టి సినిమా తీసినా, థియేటర్లలో రూ.300 పెట్టి టికెట్ కొనే ప్రేక్షకుల చేతుల్లోనే ఇండస్ట్రీ తలరాత ఉంటుంది" అని జగపతిబాబు వ్యాఖ్యానించారు.


షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు క్లాప్స్ కొట్టిన టీమ్... సినిమా విడుదలయ్యాక తన పాత్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదని డైరెక్టర్ బుచ్చిబాబును అడిగినట్లు జగపతిబాబు వెల్లడించారు. "సినిమా విడుదలయ్యాక నాకు ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి.. 'ఇంత గొప్ప పాత్ర చేసినా మిమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? ఇదే పాత్రను వేరే భాష నటుడు చేసి ఉంటే 20 సినిమాలు ఆఫర్ చేసేవారు' అని అన్నారు. 

ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకే ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడలో చేసినా నాకు అక్కడ మంచి గౌరవం లభిస్తుంది. ‘పెద్ది’ చిత్రానికి ఇంకా ఎక్కువ ఆదరణ దక్కాలి, కచ్చితంగా దక్కుతుంది. ఇందులో పనిచేసిన ప్రతిఒక్కరూ భవిష్యత్తులో గర్వంగా ఫీల్ అవుతారు" అని అన్నారు.

Go Back to Shorts
Jagapathi Babu
Janhvi Kapoor
Peddi Movie
Ram Charan
Buchi Babu Sana
Tollywood News

More Telugu News