'ఎస్ఐఆర్'పై జగన్ సంచలన వ్యాఖ్యలు... మమతా, స్టాలిన్ ఓటమికి కారణం అదే!
- ఓట్ల తొలగింపుపై వైసీపీ శ్రేణులను హెచ్చరించిన జగన్
- మమత, స్టాలిన్ ఓటమికి ఎస్ఐఆరే కారణమని ఆరోపణ
- పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపుపై అనేక రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయని జగన్ గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 94 లక్షల ఓట్లు తొలగించారని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
పశ్చిమ బెంగాల్లోని భబానీపూర్ నియోజకవర్గంలో 45,982 ఓట్లను తొలగించారని, అక్కడ మమతా బెనర్జీ 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. అదేవిధంగా, తమిళనాడులోని కొళత్తూరు నియోజకవర్గంలో 71,000 ఓట్లను తొలగించగా, స్టాలిన్ 8,000 ఓట్లతో ఓటమి చవిచూశారని జగన్ విశ్లేషించారు. ప్రతి గ్రామంలో కొద్ది సంఖ్యలో నిజమైన ఓట్లను తొలగించినా, అది నియోజకవర్గ స్థాయి ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై నిశితంగా దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపుతూ, అక్కడ ఓటర్ల జాబితాలో ఒకే పేరు, ఒకే కుటుంబ వివరాలతో వేలాది అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు.