'పౌర్ణమి' అందుకే ఆడలేదు: దర్శకుడు ఎమ్మెస్ రాజు!
- దర్శక నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి మంచిపేరు
- కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలు
- త్వరలో విడుదల కానున్న 'అగధ'
- స్టార్ హీరోలతో అందుకే చేయడం లేదని వెల్లడి
ఎమ్మెస్ రాజు నిర్మాణంలో వచ్చిన మహేశ్ బాబు 'ఒక్కడు' ఆయన స్టార్ డమ్ అను అమాంతంగా పెంచేసింది. ప్రభాస్ చేసిన 'వర్షం' సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడమే కాకుండా, వాళ్ల కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాలుగా ఇవి నిలిచాయి. అయితే ఆ తరువాత ఆ హీరోలతో ఆయన ఆ స్థాయి సినిమాలు చేయలేకపోయారు. అందుకు కారణం ఏమిటనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది.
ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. మహేశ్ బాబుతోను, ప్రభాస్ తోను నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికీ ఎక్కడ కనిపించినా వాళ్లు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. 'ఒక్కడు' తరువాత మహేశ్ బాబు క్రేజ్ పెరిగిపోయింది. ఆయన స్థాయికి తగిన కథను తయారు చేసుకోవడం కుదరలేదు. ప్రభాస్ తో 'పౌర్ణమి' తీశాను. 'వర్షం' .. 'ఛత్రపతి' తరువాత ఆయన ఇమేజ్ మారిపోవడంతో, ఆడియన్స్ కి 'పౌర్ణమి' ఎక్కలేదు. వాళ్ల ఇమేజ్ కి తగిన కథలను రెడీ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదనే ఆలోచిస్తాను తప్ప, మరొక కారణం లేదు' అని చెప్పారు.