ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం!
- విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
- టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం
- డీఎంకే నేతృత్వంలోని కూటమిలో గల మిగిలిన పార్టీలతో టీవీకే చర్చించే అవకాశం
టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై కూడా చర్చించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే నాయకులు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న పార్టీలతో టీవీకే చేతులుకలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడానికి కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ఐయూఎంఎల్, వీసీకే వంటి చిన్నపార్టీలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలకు త్వరలో ఆహ్వానాలు పంపించవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక్కడ ఆసక్తికర అంశం ఏమంటే, కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్ పార్టీలు ప్రస్తుతం డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)లో భాగస్వాములుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే రెండు సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. కాంగ్రెస్ సహా ఈ పార్టీలు టీవీకేతో జతకడితే విజయ్ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే, వీసీకే, వామపక్షాలు తమ నుంచి విడిపోయి టీవీకే పార్టీతో కలవవని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది.