కృష్ణా తీరాన సింగపూర్ మెరుపులు... మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రులు
- సింగపూర్ పర్యటనలో మెరీనా బ్యారేజీని సందర్శించిన ఏపీ మంత్రుల బృందం
- వరద నియంత్రణ, నీటి సంరక్షణ విధానాలపై అధ్యయనం
- బ్యారేజ్ ప్రాముఖ్యతను వివరించిన ఖూ టెంగ్ చై
- కృష్ణా తీరంలో ఇటువంటి మోడల్ అమలుపై మంత్రుల చర్చ
తమ సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు మెరీనా బ్యారేజీని సందర్శించారు. పర్యావరణానికి హాని కలగకుండా నీటి సమస్యలను అధిగమించడం, గ్రీన్ రూఫ్ వంటి కట్టడాలతో దీనిని ఒక పర్యాటక కేంద్రంగా ఎలా తీర్చిదిద్దారనే విషయాలను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ డైరెక్టర్ ఖూ టెంగ్ చై మంత్రుల బృందానికి వివరించారు.
ఈ పర్యటన అనంతరం హోంమంత్రి అనిత స్పందిస్తూ, మెరీనా బ్యారేజ్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో, కృష్ణా నది తీరాన కూడా ఇటువంటి ఆధునిక అభివృద్ధి నమూనాలను అమలు చేసే అవకాశాలపై తమ బృందం చర్చించినట్లు వెల్లడించారు.