ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్
- బెంగళూరు గ్రీన్‌వుడ్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో మంత్రి లోకేశ్
- సవాళ్లను స్వీకరించి లక్ష్యంపై దృష్టి పెట్టాలని యువతకు సూచన
- షార్ట్ కట్ల ప్రపంచంలో నైతికతే గొప్ప బలమని ఉద్బోధ
- ఏపీ, విశాఖ అభివృద్ధిలో సత్వా గ్రూప్ భాగస్వామి కానుందని వెల్లడి
షార్ట్‌కట్‌లతో నిండిన ప్రస్తుత ప్రపంచంలో నైతికతే గొప్ప బలమని లోకేశ్ అన్నారు. "కేవలం ఏం నేర్చుకున్నారన్నది కాకుండా, ఎలా ఆలోచిస్తున్నారనేదే అత్యంత ముఖ్యం. ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది" అని విద్యార్థులకు హితవు పలికారు. లక్ష్య సాధనలో పట్టుదలతో ఉండాలని, ఎదురయ్యే అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవాలని సూచించారు.
ఈ పర్యటన సందర్భంగా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోందని, త్వరలోనే ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతోందని వెల్లడించారు. గ్రీన్‌వుడ్ హై స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో పౌరులను (గ్లోబల్ సిటిజన్స్) తయారు చేస్తుండటం గర్వకారణమని ఆయన ప్రశంసించారు.
అంతకుముందు, పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్కూల్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్ట్ గ్యాలరీ, తరగతి గదులను సందర్శించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేశ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి, వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.









