ఇరాన్ గత పాలకుడి కంటే ఇతను కొంచెం నయం: ట్రంప్
- కాల్పుల విరమణ కోసం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అభ్యర్థించారని ట్రంప్ వెల్లడి
- అతడికి తక్కువ తీవ్రవాద భావజాలం, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని వివరణ
- హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తేనే కాల్పుల విరమణపై పరిశీలన అని షరతు
- షరతులు అంగీకరించకుంటే ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరిక
- మళ్లీ రాతియుగానికి పంపిస్తాం అంటూ పోస్ట్
"గత పాలకుడితో పోల్చితే ఇరాన్ నూతన పాలకుడు (సుప్రీం లీడర్) కొంచెం నయం అనిపిస్తున్నాడు. అతడికి తక్కువ తీవ్రవాద భావజాలం, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడతను అమెరికాతో కాల్పుల విరమణ కోరారు!" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని స్వేచ్ఛగా, సురక్షితంగా తెరిచి ఉంచినప్పుడు మాత్రమే కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన తేల్చిచెప్పారు.
ప్రపంచ ఇంధన రవాణాలో హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైనది కావడంతో కాల్పుల విరమణకు ట్రంప్ ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ షరతులను నెరవేర్చే వరకు ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ తన పోస్ట్‌లో హెచ్చరించారు. "మాటవినకుంటే ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం లేదా వారు చెప్పినట్లుగా మళ్లీ రాతియుగానికి పంపిస్తాం!" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా విలేకరులతో మాట్లాడుతూ, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు, ఒత్తిడిని కొనసాగించేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.