స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా.. గిన్నెలు కడుగుతూ సేవ!
- అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ప్రియాంక చోప్రా
- ఆలయంలో గిన్నెలు కడుగుతూ సేవలో పాల్గొన్న స్టార్ హీరోయిన్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రియాంక సేవా కార్యక్రమం
- రాజమౌళి-మహేశ్ బాబు సినిమా కోసమే భారత్‌కు వచ్చినట్టు ఊహాగానాలు
- ‘వారణాసి’ చిత్రంలో మందాకిని పాత్రలో నటిస్తున్న ప్రియాంక
నిన్న మహావీర్ జయంతి సందర్భంగా ప్రియాంక స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. గులాబీ రంగు దుస్తులు ధరించి, తలపై దుపట్టా కప్పుకుని ఆమె ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సిక్కు మతంలో ఎంతో పవిత్రంగా భావించే ‘సేవ’లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉపయోగించే పాత్రలను ఆమె శ్రద్ధగా శుభ్రం చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఒక సామాన్య భక్తురాలిగా ఆమె సేవలో నిమగ్నమవడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
అయితే, ప్రియాంక భారత్ పర్యటన వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆమె తన సినిమా షూటింగ్ కోసమే ఇక్కడికి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ అనే చిత్రంలో ప్రియాంక నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసమే ఆమె పంజాబ్ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ భారీ యాక్షన్ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చాలా విరామం తర్వాత ప్రియాంక చోప్రా ‘వారణాసి’ చిత్రంతో భారతీయ సినీ పరిశ్రమలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ‘మందాకిని’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.