రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న విజయ్
- తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లోనూ టీవీకే పోటీ
- అభ్యర్థులు ప్రజారక్షకులేనని ప్రకటించిన దళపతి
- డ్రగ్స్ రహిత రాష్ట్రం, యువతకు భృతి వంటి కీలక హామీలు
విజయ్ తన పూర్తి పేరు ‘సి. జోసెఫ్ విజయ్’తో నామినేషన్ వేయనున్నారు. చెన్నైలోని పెరంబూర్, మధ్య తమిళనాడులో పట్టు కోసం తిరుచిరాపల్లి (ట్రిచీ) ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. తమ అభ్యర్థులను ‘మక్కల్ కాప్పాలర్గల్’ (ప్రజారక్షకులు)గా అభివర్ణించిన విజయ్, వారు రాజకీయ నాయకులు కాదని, ప్రజల్లో ఒకరని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు తమ పార్టీకి, డీఎంకే కూటమికి మధ్యే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ చెన్నైలోని టీ నగర్ నుంచి, ప్రచార విభాగం నేత ఆదవ్ అర్జున విల్లివాక్కం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి కె.ఎ. సెంగోట్టయన్ గోబిచెట్టిపాళయం నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్ పలు కీలక హామీలను ప్రకటించారు. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, 29 ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు నెలవారీ ఆర్థిక సాయం, ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతకు ప్రత్యేక చట్టం, విద్యార్థులకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మార్చి 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, విజయ్ నిర్ణయంతో డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల్లో రాజకీయ వేడి పెరిగింది.