ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్
- ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణకు ఏపీలో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు
- ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం
- పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ఫ్రిస్కింగ్ బాధ్యత ఇకపై రాష్ట్ర పోలీసులకే
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీకి రూపకల్పన
ఎన్టీఏ పరీక్షల సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఎన్టీఏకు బలమైన అనుసంధానం ఉండాలని రాధాకృష్ణన్ కమిటీ సూచించింది. దీని ఆధారంగానే కేంద్ర విద్యాశాఖ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం, పరీక్షా కేంద్రాల్లో అక్రమాలను నివారించేందుకు అభ్యర్థులను తనిఖీ చేసే (ఫ్రిస్కింగ్) బాధ్యతను పూర్తిగా రాష్ట్ర పోలీసులకే అప్పగించారు. ఇప్పటి వరకు కేంద్రాల వద్ద భద్రత, శాంతిభద్రతలకే పరిమితమైన పోలీసులు ఇకపై ఫ్రిస్కింగ్ కూడా నిర్వహిస్తారు.
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఛైర్మన్గా రాష్ట్ర స్థాయి కమిటీ పనిచేస్తుంది. ఇందులో ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఏడీజీ (లా అండ్ ఆర్డర్) సహా పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా, జిల్లా కలెక్టర్ ఛైర్పర్సన్గా జిల్లా స్థాయి కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీలు నీట్(యూజీ)-2026తో పాటు ఎన్టీఏ నిర్వహించే ఇతర పరీక్షలను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాయి.