వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే!
- తెలంగాణలో ఆర్సీ, డీఎల్ కార్డుల జారీకి సెంట్రలైజ్డ్ విధానం
- వాహనదారుల ఇళ్లకే నేరుగా కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
- ఏజెంట్ల ప్రమేయం, జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం
- సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో రవాణా శాఖ కసరత్తు
- రవాణా శాఖకు యూజర్ ఛార్జీల నిధుల కేటాయింపునకు అంగీకారం
ప్రస్తుతం రాష్ట్రంలోని 61 ఆర్టీఏ కార్యాలయాల్లో కార్డుల ముద్రణ జరుగుతుండటంతో తీవ్ర జాప్యం నెలకొంది. ఏటా సుమారు 15 లక్షల కార్డులు జారీ చేయాల్సి ఉండగా, లబ్ధిదారులకు చేరడానికి నెలల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తనిఖీల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఏజెంట్ల వద్ద వందలకొద్దీ కార్డులు లభ్యం కావడంతో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులను ముద్రించి, నేరుగా వాహనదారుడి చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తారు. దీనివల్ల ఏజెంట్ల ప్రమేయం పూర్తిగా తొలగిపోతుంది. కార్డులు చేరలేదని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి, డూప్లికేట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవసరం కూడా తప్పుతుంది. ఈ సంస్కరణతో పాటు రవాణా శాఖకు ఏటా యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే సుమారు రూ. 135 కోట్లను శాఖకే కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. ఈ నిధులతో శాఖాపరమైన సేవలను మరింత మెరుగుపరచడానికి వీలు కలుగుతుంది.