దుబాయ్ ఎయిర్‌పోర్ట్ క్లోజ్.. ఇరాన్ క్షిపణి దాడులతో గల్ఫ్ లో హైఅలర్ట్!
- దుబాయ్, కువైట్ ఎయిర్‌పోర్టులపై ఇరాన్ క్షిపణి దాడులు!
- ఎయిర్‌పోర్టుల్లో నిలిచిన విమాన సర్వీసులు
- అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. క్షిపణి శకలాలు పడటంతో విమానాశ్రయ రన్ వే దెబ్బతిన్నట్లు సమాచారం. కువైట్‌లోని అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌పై కూడా డ్రోన్ల దాడి జరిగినట్లు కువైట్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఈ దాడుల్లో పలువురు కువైట్ సైనికులు గాయపడ్డారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన గగనతలంలోకి దూసుకొచ్చిన 9 బాలిస్టిక్ క్షిపణులను, 33 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది. అయితే, క్షిపణి శకలాలు దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ వంటి ప్రముఖ కట్టడాల సమీపంలో పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా జరిపిన బాంబు దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) ప్రకటించాయి. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.