'ధురంధర్ 2' హిట్ అయితే దక్షిణాది సినిమాలకు దెబ్బే: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
- 'ధురంధర్ 2' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ
- ఈ సినిమా రూ. 2000 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా
- అలా జరిగితే దక్షిణాది చిత్రాల ఆధిపత్యానికి గండి పడుతుందన్న వర్మ
- సౌత్ సినిమాలు ఇంకా ఓల్డ్ స్కూల్ పద్ధతిలోనే ఉన్నాయని వ్యాఖ్య
- మొదటి భాగం కంటే రెండో భాగమే పెద్ద హిట్ అవుతుందని జోస్యం
వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. "ధురంధర్ 2 విజయం సాధిస్తే సౌత్ సినిమాలన్నీ పక్కకు వెళ్లిపోతాయని నేను భావిస్తున్నాను. దక్షిణాది చిత్రాలు ఇంకా పాత పద్ధతుల్లోనే రూపొందుతున్నాయి" అని వ్యాఖ్యానించారు. గాల్లో ఎగరడం వంటివి కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో కూడా 'ధురంధర్ 2'ను భారీగా ప్రమోట్ చేస్తున్న విషయాన్ని వర్మ గుర్తుచేశారు.
ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని వర్మ ధీమా వ్యక్తం చేశారు. మొదటి భాగంలోని పాత్రలు, కథతో ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో కనెక్ట్ అయ్యారని, కాబట్టి రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారని అన్నారు. బాహుబలి తరహాలోనే ఈ రెండు భాగాలను కలిపి చిత్రీకరించారని, అందుకే ఇది ఫ్రాంచైజీలా కాకుండా ఒకే కథ కొనసాగింపులా ఉంటుందని వివరించారు. మొదటి భాగం కంటే రెండో భాగమే ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు.