తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
- శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ
- దేశవ్యాప్తంగా భక్తులకు పోస్టల్ ద్వారా డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు
- ఆదాయం పెంపుపై ఫైనాన్స్ కమిటీ చేసిన సిఫార్సులకు పాలకమండలి ఆమోదం
- తక్కువ ధరలో బంగారం పూత పూసిన వెండి డాలర్ల విక్రయానికి ప్రతిపాదన
ఇటీవల టీటీడీ ఆదాయం పెంచే మార్గాలపై అధ్యయనం కోసం ఓ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శ్రీవారి డాలర్ల విక్రయాలను మరింత పెంచాలని, వాటిని ఆన్‌లైన్‌లో కూడా విక్రయించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం తిరుమలలోని కౌంటర్లలో విక్రయిస్తున్న బంగారు, వెండి డాలర్లు, పెండెంట్లతో పాటు కొత్తగా నాణేలను కూడా ఆన్‌లైన్‌లో అమ్మనున్నారు. అంతేకాకుండా, ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్యులను దృష్టిలో ఉంచుకుని, వెండి డాలర్లకు బంగారు పూత పూసి తక్కువ ధరకే విక్రయించాలని కమిటీ ప్రతిపాదించింది. డాలర్లను మరింత ఆకర్షణీయమైన డిజైన్లలో తయారు చేయాలని కూడా నిర్ణయించారు.
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే డాలర్లు భక్తులకు సురక్షితంగా చేరేలా ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయంతో తిరుమల రాలేని భక్తులు కూడా స్వామివారి డాలర్లను సులభంగా పొందే అవకాశం కలగనుంది.