బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.50,000 కోట్లు విడుదల చేసిన ఆర్బీఐ
- ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ప్రభుత్వ బాండ్ల కొనుగోలు
- ముంచుకొస్తున్న అడ్వాన్స్ టాక్స్, జీఎస్టీ చెల్లింపుల నేపథ్యంలో ముందస్తు చర్యలు
- ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.2.41 లక్షల కోట్ల మిగులు నగదు లభ్యత
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఓఎంఓ ద్వారా రూ.2.50 లక్షల కోట్ల నిధుల పంపింగ్
దీనిలో భాగంగా వేర్వేరు కాలపరిమితులు ఉన్న పలు ప్రభుత్వ బాండ్లను సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఇందులో ప్రధానంగా 2035లో మెచ్యూర్ అయ్యే 6.33 శాతం వడ్డీ గల రూ.13,507 కోట్ల బాండ్లను, 2030లో ముగిసే 6.01 శాతం వడ్డీ గల రూ.13,494 కోట్ల సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. అలాగే 2031 నాటివి రూ.8,157 కోట్లు, 2053 నాటివి రూ.6,955 కోట్లు, 2033 కాలపరిమితి ఉన్న రూ.4,479 కోట్ల బాండ్లను తన ఖాతాలోకి వేసుకుంది.
వీటితో పాటు 2039లో ముగిసే రూ.2,304 కోట్లు, 2034 నాటి రూ.1,104 కోట్ల సెక్యూరిటీలను కూడా ఆర్బీఐ సేకరించింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో నిధులను మేనేజ్ చేయడానికి ఆర్బీఐ ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేస్తుంటుంది.
ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం.. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రస్తుతం సుమారు రూ.2.41 లక్షల కోట్ల మిగులు నగదు అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుల ద్వారా నిధులు బయటకు వెళ్లినప్పటికీ, వ్యవస్థలో నగదు లభ్యత సురక్షితంగా ఉంటుందని, మిగులు నిధులు రూ.3.02 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా. కాగా, ఈ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం నుంచి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఆర్బీఐ సుమారు రూ.2.50 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయడం గమనార్హం.