అమెరికాలో 'ఉస్తాద్' ఫీవర్.. విడుదలకు ముందే రికార్డు వసూళ్లు!
- అమెరికాలో జోరుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ బుకింగ్స్
- కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు
- పవన్-హరీశ్ శంకర్ కాంబోపై ఓవర్సీస్‌లో భారీ క్రేజ్
- భారీ అంచనాల మధ్య ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత పుంజుకుంటాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు విదేశాల్లో ఉన్న బలమైన ఫ్యాన్ బేస్, అలాగే హరీశ్ శంకర్‌తో ఆయన కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా ఉండటంతో ఈ క్రేజ్ ఏర్పడింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, నార్త్ అమెరికా మార్కెట్‌లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే ప్రీమియర్లతోనే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. వీరిద్దరి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా హరీశ్ శంకర్ ఈ సినిమాను పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తీర్చిదిద్దుతున్నారు.
'ఓజీ' వంటి భారీ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు పది రోజుల ముందే ఓవర్సీస్‌లో ఈ స్థాయిలో బిజినెస్ జరగడం చూసి, సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.