టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్... లంకపై గెలిచినా నిరాశే... సెమీస్ కు న్యూజిలాండ్
- శ్రీలంకపై 5 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్థాన్
- సెమీస్ చేరాలంటే 64 పరుగుల తేడాతో గెలవాల్సిన పరిస్థితి
- పాక్ ఆశలపై నీళ్లు చల్లిన లంక కెప్టెన్ దాసున్ షనక
- సాహిబ్జాదా ఫర్హాన్ సూపర్ సెంచరీ వృథా
- లంక బౌలర్ మధుశంకకు మూడు వికెట్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (60 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫకర్ జమాన్ (42 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 176 పరుగులు జోడించారు. అయితే చివర్లో లంక బౌలర్లు పుంజుకోవడంతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
అనంతరం, సెమీస్ చేరాలంటే 148 పరుగులకు మించి ఇవ్వకూడదన్న ఒత్తిడితో పాక్ బౌలింగ్ ప్రారంభించింది. లంక బ్యాటర్లు పవన్ రత్నాయకే (37 బంతుల్లో 58), కెప్టెన్ దాసున్ షనక (31 బంతుల్లో 76 నాటౌట్) పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షనక 8 సిక్సర్లతో పాక్ సెమీస్ ఆశలను ఆవిరి చేశాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ (3/23) రాణించినా ఫలితం లేకపోయింది. చివరకు లంక 207/6 స్కోరు చేయడంతో, పాక్ 5 పరుగులతో గెలిచినా టోర్నీ నుంచి ఇంటిబాట పట్టింది.